- అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు ప్రత్యేక సెషన్ పెట్టండి
- సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఆదివాసీలను ప్రత్యేక మతంగా గుర్తించి, వారి మతాన్ని నమోదు చేయడానికి జనగణనలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత కోరారు. ఈ మేరకు అసెంబ్లీ, కౌన్సిల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆమె సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లు గడిచినా బీసీలకు జనాభా దామాషా దక్కాల్సిన ఫలాలు అందడం లేదన్నారు.
దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎంత మంది ఉన్నారనే దానిపై చట్టబద్ధమైన లెక్కలు లేకపోవడంతోనే వారికి ఫలాలు దక్కడం లేదని తెలిపారు. జనగణనలో ఎస్సీ, ఎస్టీలను లెక్కించినట్టుగానే ఓబీసీలను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. జనగణనలో కులాన్ని నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ ఉన్నప్పటికీ.. వారంతా ఓబీసీలకు చెందుతారని చెప్పడానికి ఎలాంటి కాలమ్ లేదని తెలిపారు.
ఫలితంగా ఓబీసీ కులాల వారిని ఇతరుల కేటగిరీలో చేర్చుతారని, ఓబీసీల జనాభా ఎంత అనే దానిపై స్పష్టత లేకుండా పోతుందన్నారు. జనగణనలో ఓబీసీలను లెక్కించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అనేక ఓబీసీ సంఘాలు ఆందోళనలు చేపట్టాయని వివరించారు. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని జనగణనలో ఓబీసీ కులాలను లెక్కించే ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్లో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వారిది ప్రత్యేక జీవన శైలి..
దేశ మూలవాసులైన ఆదివాసీలది ప్రత్యేక జీవన శైలి అని కవిత గుర్తుచేశారు. ప్రకృతిని, అడవిని తమ వేల్పుగా పూజించడం ఆదివాసీల ప్రత్యేకత అని తెలిపారు. ఒక్కో ఆదివాసీ తెగ ఒక్కో దేవతను, చెట్టును, పక్షిని, జంతువును పూజిస్తాయని, గతంలో చేపట్టిన జనగణనలో వారిని ప్రత్యేక మతంగా నమోదు చేసే వారని తెలిపారు. జనగణనలో ఆదివాసీల మతం నమోదుకు ప్రత్యేక కాలమ్ లేకపోవడంతో ఆయా వర్గాల వారు ఆందోళనలో ఉన్నారన్నారు.
ఓబీసీల జనాభా లెక్క తేలాలన్నా, ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం వెంటనే రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఓబీసీల కులగణన, ఆదివాసీల మతం నమోదుపై వేర్వేరు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు.
